కలం, నిర్మల్: సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా మార్చడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) అన్నారు. నిర్మల్ జిల్లా పోలీసు (Nirmal Police) శాఖను మరింత సాంకేతికంగా బలోపేతం చేసి ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వివిధ పోలీస్ స్టేషన్లకు నూతన సాంకేతిక పరికరాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం అందజేశారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు బార్‌కోడ్ స్కానర్లు, లేబుల్ ప్రింటర్లు, సింగిల్ డిజిట్ స్కానర్లు, ఫింగర్ ప్రింట్ బ్యూరో సిస్టమ్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ప్రింటర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లలో కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్లు, ట్యాబ్‌లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా మార్చవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ యూనస్ అలీ, ఇన్స్పెక్టర్లు కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, ఆర్ఐ (అడ్మిన్) రామ్ నిరంజన్, ఎస్సైలు లింబాద్రి, శ్రీకాంత్, రవీందర్, గణేష్, శ్రావణి, హన్మండ్లు తదితరులు పాల్గొన్నారు.

