డ్రగ్స్ రహితంగా నిర్మల్ జిల్లాను తీర్చిదిద్దాలి.. కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి డ్రగ్స్ నివారణపై జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ, అటవీ, విద్య, వ్యవసాయ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

గంజాయి ఇతర మాదకద్రవ్యాల సాగు, నిల్వ, రవాణా, విక్రయం లేదా వినియోగాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ నిరంతర చర్యలు చేపడుతోందని తెలిపారు. శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహిస్తూ, మాదకద్రవ్యాల విక్రయం, రవాణాలో పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పటిష్ట నిఘాతోపాటు యువత, విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాథోడ్ రమేశ్, జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ దేవీదాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రెవెన్యూ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

నిర్మల్ జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి, ప్రజావాణి, సీఎం ప్రజావాణి, రెవెన్యూ సదస్సులు, సదాబైనామా తదితర భూ సమస్యలకు సంబంధించిన దీర్ఘకాలిక పెండింగ్ దరఖాస్తులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అన్ని దరఖాస్తులను పూర్తి చేయాలని, పరిష్కారం కాని వాటిని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని సూచించారు. ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే ఇసుక విక్రయాలు జరిగేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ రాకేశ్, డీఆర్‌వో రాథోడ్ రమేశ్, ఆర్డీఓ దేవీదాస్, ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ నరసింహమూర్తి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>