కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలోని జిల్లా పరిషత్ క్వార్టర్స్‌లో ఉన్న నగరపాలక సంస్థ పార్కును త్వరలోనే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయనున్నట్లు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Sunil Rao) తెలిపారు. శుక్రవారం ఆయన పార్కును సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ.. పార్కులో పలు సౌకర్యాలను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. పాడైపోయిన ఫౌంటేన్‌ను వెంటనే బాగుచేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పాడైపోయిన బాత్‌రూమ్‌లు, దెబ్బతిన్న వాకింగ్ ట్రాక్‌ను మెరుగుపర్చాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పచ్చదనం పెంపొందించాలని చెప్పారు.
పార్క్ నలుమూలలా నాలుగైదు డివిజన్ల నుంచి సుమారు 500 మంది ప్రజలు ప్రతిరోజూ ఈ పార్కుకు వస్తుంటారని సునీల్ రావు తెలిపారు. వారి సౌకర్యార్థం రాబోయే రెండు మూడు నెలల్లో పార్కును పూర్తిగా ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. సరిగ్గా పది సంవత్సరాల క్రితం అప్పట్లో రూ.52 లక్షల వ్యయంతో ఈ పార్కును నిర్మించి ప్రారంభించినట్లు ఆయన గుర్తు చేశారు. తిరిగి ఇప్పుడు ఈ పార్కును ఆధునీకరించి, అధునాతన సౌకర్యాలు కల్పించి నగర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నామని సునీల్ రావు తెలియజేశారు.

