కలం, ఖమ్మం బ్యూరో: ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు రూ. 18 వేల వేతనాన్ని వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలతో (Anganwadi Workers Protest) నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి, మహాధర్నా కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని సాంబశివరావు మాట్లాడారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మాతాశిశు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, గర్భిణులు, శిశువుల మరణాల నివారణకు అంగన్వాడీలు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన కొనియాడారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, కేవలం రూ. 13 వేల వేతనంతో ఏ కుటుంబమూ ఇల్లు గడపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వేతనం పెంచాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
అంగన్వాడీ కేంద్రాల అద్దెలు, గ్యాస్, ‘ఆరోగ్యలక్ష్మి’ పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. కేంద్రాలకు సరఫరా చేస్తున్న నాసిరకం సరుకుల టెండర్లను రద్దు చేసి శనగలు, కారం, చింతపండు, గుడ్లు నాణ్యమైనవి పంపిణీ చేయాలని కోరారు. టీచర్లపై బలవంతంగా రుద్దుతున్న బీఎల్వో విధులను తక్షణమే తొలగించాలని, అదనపు పనిభారాలు మోపితే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
అంగన్వాడీలకు పీఎఫ్, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఖాళీగా ఉన్న గ్రేడ్-2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, ఆయాలకు కనీసం రూ. 10 వేల వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమం అనంతరం అంగన్వాడీల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా సంక్షేమ శాఖ అధికారి తారకు అందజేశారు.
ఈ మహాధర్నాలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, వేల్పుల మల్లికార్జున్, భూక్యా శ్రీనివాస్, నాయకులు రెడ్డి అరుణ, విజయ, భారతి, సంధ్య, ఇందిర, మీనాకుమారి, కృష్ణకుమారి, సమ్మక్క, చిన్నారి, శ్రీదేవి, సునీత, సరస్వతి, సుజాత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

