కలం, స్పోర్ట్స్: అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings) లో ఆ జట్టు 6వ స్థానానికి చేరుకుని తమ అత్యుత్తమ ర్యాంక్‌ను నమోదు చేసింది.ఈ క్రమంలో అఫ్ఘానిస్థాన్ శ్రీలంక జట్టును అధిగమించింది. ఇప్పటికే ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ వంటి దిగ్గజ జట్లను దాటి ముందుకు వెళ్లిన ఆఫ్ఘన్, ఇప్పుడు శ్రీలంకను కూడా వెనక్కి నెట్టింది. 2009లో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన ఆ జట్టు, ఇప్పటివరకు ఆడిన 191 మ్యాచ్‌లలో 96 విజయాలు సాధించింది.టీమ్ ప్రతిభ గత కొంతకాలంగా మైదానంలో స్పష్టంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్, శ్రీలంకపై చారిత్రాత్మక విజయాలు సాధించడమే కాకుండా, 2024 టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరింది.
ఇటీవల ఐర్లాండ్‌పై 4-0తో వన్డే సిరీస్ గెలిచిన ఆ జట్టు, ముక్కోణపు సిరీస్‌లోనూ ఓటమి లేకుండా నిలిచింది.మరోవైపు టీ20 ఫార్మాట్లోనూ అఫ్ఘానిస్థాన్ జోరు కొనసాగుతోంది. షార్జాలో ఆదివారం జరిగిన చివరి టీ20లో జింబాబ్వేను 7 వికెట్ల తేడాతో ఓడించి, 3-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ 13 పరుగులకే 5 వికెట్లు తీసి కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం అఫ్ఘానిస్థాన్ 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్ 25 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
Also Read : ఇబ్రహీం మాజాకి మెస్సీ ఓటు.. కొపా ట్రోఫీ ఓటింగ్‌లో సంచలనం!
Follow Us On : WhatsApp

