కలం, నిర్మల్ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించి, పూర్తి చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలంలో గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యను పరిష్కరించాలంటూ గ్రామస్థులు చేసిన విజ్ఞప్తి మేరకు గత ఏడాది హామ్స్ నిధుల నుంచి బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్లు మంజూరు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్, జన్నారం మండల బీజేపీ నాయకుడు కొంతం శంకరయ్య సోమవారం ఎమ్మెల్యే ఏలేటిని కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన ఆయన (Maheshwar Reddy) సంబంధిత శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌తో ఫోన్లో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాల్సిన ఆవశ్యకతను వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.

