కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal ) జిల్లా కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారి సునీత ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మిఠాయి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో గడువు ముగిసిన మిఠాయిలు, చాక్లెట్లు, అలాగే లేబుళ్లు లేని ఆహార పదార్థాలను గుర్తించారు. తనిఖీల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ, పదార్థాల వివరాలు తప్పనిసరిగా ఉండాలని, దుకాణదారులు వాటిని క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. గడువు ముగిసిన వస్తువులను వెంటనే విక్రయాల నుంచి తొలగించాలని హెచ్చరించారు.
ఫిర్యాదులు వచ్చినప్పుడే తనిఖీలు..?
జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ, అధికారులు ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు ఒక్క ఫుడ్ సేఫ్టీ అధికారి మాత్రమే ఉండటంతో తనిఖీలు పరిమితంగా జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ప్రత్యేకించి చిన్నపిల్లలు ఎక్కువగా వినియోగించే చాక్లెట్లు, స్నాక్స్, మిఠాయిలపై మరింత కఠిన పర్యవేక్షణ అవసరమని ప్రజలు కోరుతున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

