ధరల మోత.. బీజేపీపై చాడ వెంకటరెడ్డి ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) ఆరోపించారు. సామాన్యులపై ధరల భారం మోపుతున్న బీజేపీ పాలనకు రానున్న రోజుల్లో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ చేపట్టిన ప్రచార జాతా నాలుగో రోజు చిగురుమామిడి మండలంలోని రేకొండ, చిగురుమామిడి, పీచుపల్లి, ముల్కనూర్, సీతారాంపూర్, లంబాడిపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ఓగులాపూర్, ముదిమాణిక్యం, రామంచ గ్రామాలలో  పర్యటించింది. వివిధ గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాలకు మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు.

ప్రచార జాతాకు ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై రోజురోజుకూ పెనుభారం మోపుతోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో దేశ అప్పులు రూ.55 లక్షల కోట్లకు పైగా ఉండగా, 12 ఏళ్లలో దాదాపు నాలుగింతలు పెరిగి రూ.214 లక్షల కోట్లకు పైగా చేరాయని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలపై అడ్డగోలుగా పన్నుల భారం మోపుతోందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలనే విధానం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని, ఇది కూలీల పొట్ట కొట్టే విధంగా ఉందని విమర్శించారు. ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం చేస్తోందని చాడ వెంకటరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు రాజ్యాంగం కల్పించిన హక్కులని, అర్హులైన నిరుపేదలకు వాటిని అందించడంలో జాప్యం చేయడం సరికాదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వ పాలన గాడి తప్పుతోందనే అనుమానం కలుగుతోందని, దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని అన్నారు.

ఈ ప్రచార జాతాలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ జాగీరీ సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పొనగంటి కేదారి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జాతా కోఆర్డినేటర్లు గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బోయిని అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, అందె చిన్నస్వామి, బోయిని వల్లభాయ్ పటేల్, కాంతాల శ్రీనివాస్ రెడ్డి,  మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బీర్ల పద్మ, ప్రధాన కార్యదర్శి కొట్టె అంజలి, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బామండ్లపెల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>