కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలో ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో శనివారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి జిల్లా పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. నిర్మల్, బైంసా, ఖానాపూర్ న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ చేసుకునే విధంగా కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లో పలు రకాల కేసుల పరిష్కారం కోసం అవకాశం ఉంటుందని ఈ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీనివాస్ , బైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

