అడెల్లి పోచమ్మ ఆలయ సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపం.. భక్తుల ఆగ్రహం!

కలం, నిర్మల్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహాపోచమ్మ (Adelli Mahapochamma) ఆలయం వద్ద చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతపై భక్తులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలను పాటించకుండా తొందరపాటుగా పనులు చేపడుతున్నారని, దీంతో ప్రజాధనం వృథా అవుతోందని ఆరోపిస్తున్నారు.

నిర్మాణంలో నాసిరకం ఇసుక, తక్కువ గ్రేడ్ సిమెంట్ వినియోగిస్తున్నారని, సీసీ మిశ్రమంలో సరైన నిష్పత్తులు పాటించడం లేదని విమర్శిస్తున్నారు. ఇలాంటి పనులు జరుగుతున్న సమయంలో సంబంధిత పీఆర్ ఏఈ లేదా వర్క్ ఇన్‌స్పెక్టర్ తప్పనిసరిగా పర్యవేక్షించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం పనులు జరుగుతున్న విషయం సంబంధిత అధికారికే తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని స్థానికులు అంటున్నారు. పర్యవేక్షణ లోపించడంతో గుత్తేదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

“రోడ్డు వేశామా… బిల్లు తీసుకున్నామా…” అన్నట్లుగా

“నాణ్యతతో పనిలేదు… రోడ్డు వేశామా… కమిషన్ ఇచ్చామా… బిల్లు తీసుకున్నామా…” అన్న ధోరణిలో కొందరు గుత్తేదారులు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే నాసిరకం పనులు జరుగుతున్నాయని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. అడెల్లి మహాపోచమ్మ ఆలయం వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులపై సాంకేతిక నిపుణులతో నాణ్యత పరీక్షలు నిర్వహించి, లోపాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి కావాలని వారు కోరుతున్నారు.

పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి: డీఈ తుక్కారం

అడెల్లి గ్రామంలోని శ్రీ మహాపోచమ్మ ఆలయం వద్ద చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టాలని పంచాయతీ రాజ్ డీఈ తుక్కారం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా చేపడుతున్న పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, నిబంధనల ప్రకారం సిమెంట్, ఇసుక, కంకరతో పాటు ఇతర నిర్మాణ సామగ్రిని వినియోగించాలన్నారు. నాణ్యతలో లోపాలు తలెత్తితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>