కలం, నిర్మల్: నిర్మల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో కొలువుదీరిన శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయం (Nirmal Datta Sai Temple)లో అన్నదాన కార్యక్రమం క్రమంగా అస్తవ్యస్తంగా మారుతోందన్న ఆరోపణలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి గురువారం బాబా దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించాల్సిన ఆలయంలోనే అన్నం సరిపోక భక్తులు ఆకలితో వెనుదిరగాల్సిన పరిస్థితి (Food Shortage) నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఘనంగా సాగిన అన్నదాన కార్యక్రమం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన తర్వాత క్రమంగా కుదించుకుపోయిందని భక్తులు ఆరోపిస్తున్నారు.
నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే ప్రధాన రహదారికి సమీపంలోని గండి రామన్న దత్త సాయిబాబా ఆలయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. రాతి గుహల్లో శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఈ క్షేత్రానికి ప్రతివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా గురువారం సాయిబాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. దత్తాత్రేయ జయంతి, గురుపౌర్ణమి వంటి వేడుకలను శ్రీ సాయి సేవా సంఘ్ ఆధ్వర్యంలో గతంలో అత్యంత వైభవంగా నిర్వహించేవారు.
దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లినప్పటి నుంచే సమస్యలా..?
ఆలయ నిర్వహణను 2024లో దేవాదాయ శాఖకు అప్పగించారు. అప్పటినుంచి ఆలయానికి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తొలుత సింగిల్ ట్రస్ట్ చైర్మన్గా లక్కడి జగన్మోహన్ రెడ్డి, అనంతరం ఆలయ చైర్మన్ గా గంగోని బూరాజ్, ప్రస్తుతం కొట్టే శేఖర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే నిర్వహణ వ్యవస్థ మారినా భక్తులకు అందాల్సిన అన్నప్రసాదం విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ఏర్పాట్లు జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ప్రతి గురువారం సుమారు 150 కిలోల బియ్యంతో అన్నదానం నిర్వహించేవారని భక్తులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పరిమాణం 50 కిలోలకు పడిపోయిందని పేర్కొంటున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అన్నప్రసాదం సిద్ధం చేయకపోవడంతో చాలామందికి భోజనం అందడం లేదని, ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు నిరాశతో వెనుదిరుగుతున్నాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉపవాస దీక్షతో బాబా దర్శనానికి వచ్చేవారికి అన్నప్రసాదం అందకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.
ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగాలనే ఉద్దేశంతో సాయి భక్తులు సాయి సేవా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సుమారు రూ.32 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు భక్తులు చెబుతున్నారు. గతంలో సంఘం ఆధ్వర్యంలో అన్నదానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించేవారని గుర్తు చేస్తున్నారు. అయితే ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్లక్ష్యానికి గురవుతోందని ఆరోపిస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, నిర్వహణలో మాత్రం అధికారులు చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆదాయం రావడం లేదు.. ఖర్చులు పెరిగాయి: ఇంచార్జి ఈఓ భూమయ్య
ఆలయానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని ఇంచార్జి ఈవో భూమయ్య తెలిపారు. గత ఐదు నెలల ఆదాయాన్ని పరిశీలిస్తే రూ.1,88,000 మాత్రమే వచ్చిందని, అందులో విద్యుత్ బిల్లులు, పూజారుల వేతనాలు చెల్లించాల్సి వస్తోందని వివరించారు. అన్నదానానికి అవసరమైన కిరాణా సరుకుల బిల్లులు కూడా పేరుకుపోతున్నాయని, వాటిని చెల్లించడం కష్టంగా మారిందన్నారు. గతంలో 100 కిలోల బియ్యంతో అన్నదానం నిర్వహించేవారమని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా 50 కిలోలకు పరిమితం చేశామని వెల్లడించారు.
అన్నదానం చేయలేకపోతే మాకు అప్పగించండి: వెన్నెల చిన్నయ్య, సాయి భక్తుడు
తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సాయిబాబా దర్శనానికి ఈ ఆలయానికి వస్తున్నానని భక్తుడు వెన్నెల చిన్నయ్య తెలిపారు. భక్తులంతా కలిసి శ్రీ సాయి సేవా సంఘ్ ను ఏర్పాటు చేసుకుని అన్నదాన కార్యక్రమం కోసం సుమారు రూ.32 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశామని చెప్పారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లిన తర్వాత ఆలయ అభివృద్ధి, అన్నదాన కార్యక్రమాలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అన్నదానం నిర్వహించడం దేవాదాయ శాఖకు సాధ్యం కాకపోతే తిరిగి సాయి సేవా సంఘానికి బాధ్యతలు అప్పగించాలని, భక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటామని స్పష్టం చేశారు.

