కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఏ ఉపాధ్యాయుడైన క్రమశిక్షణతో విద్యార్థులు మెలగాలని చక్కని చదువులు చదవాలని కోరుతాడు. కానీ నారాయణపేట జిల్లా కేంద్రంలోని మైనార్టీ పాఠశాలలో (Minority School) మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏకంగా విద్యార్థులను తమ వ్యక్తిగత అవసరాల కోసం రెచ్చగొట్టి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల చొక్కాలు పట్టి కొట్టే స్థాయికి కొంతమంది తెర వెనక పరోక్షంగా మద్దతు తెలిపారు. మైనార్టీ కళాశాల ప్రిన్సిపల్ ఖాజా మెహబూబ్ ఖాన్ పై ఆరోపణలు రావడంతో ఆయనను గురుకులాల సెక్రటరీ కార్యాలయం నుంచి సస్పెండ్ (Suspension) చేస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు వచ్చాయి.
అధికారికంగా ఉత్తర్వులు వచ్చిన రెండు రోజులు కూడా ప్రిన్సిపల్ మైనార్టీ పాఠశాలలో ప్రిన్సిపల్ గదిలో ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. తాను సస్పెండ్ అయినట్లు కొంతమంది విద్యార్థులతో చెప్పి నేను ఉండాలంటే మీరు గొడవ చేయాలని…పేపర్లలో టీవీలలో వస్తేగానీ నేను తిరిగి ప్రిన్సిపల్ గా కొనసాగలేని పరిస్థితి ఉందని విద్యార్థులకు చెప్పినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా ఇద్దరు విద్యార్థులతో ఉద్దేశపూర్వకంగా వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి జిల్లా స్థాయి అధికారులను పక్కా ప్లాన్ గా కూడా తప్పుదోవ పట్టించారు. ఉద్దేశపూర్వకంగా ఆందోళనకు తెరలేపిన విద్యార్థులలో మెజార్టీ విద్యార్థులు వసతి గృహంలో ఉండే విద్యార్థులు కాదని తెలుస్తోంది.
సస్పెండ్ అయిన ప్రిన్సిపాల్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు…
ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయిన ప్రిన్సిపల్ కు మద్దతుగా కొంతమందిని ఉద్దేశపూర్వకంగా పాఠశాలకు రప్పించినట్లు తెలుస్తోంది. మీరు నాకు మద్దతిస్తే మీకు ఏం కావాలో అది చేస్తానని చెప్పినట్లు సమాచారం. విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. తప్పుడు పోస్టులు వైరల్ చేయండి పై స్థాయి అధికారులకు విషయం తెలిసి తిరిగి నన్ను ప్రిన్సిపల్ గా కొనసాగిస్తారని చెప్పినట్లు తెలుస్తోంది.
విద్యార్థులు 400 మంది ఎక్కువైన దుప్పట్లు ఎటు మాయం
మైనార్టీ పాఠశాలలో సుమారు 400 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు సంబంధించి దుప్పట్లు ఎక్కువ 500 కు పైగా రాగ మిగిలిన దుప్పట్లు ఏమైపోయాయి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన విద్యార్థులు చదువు నిర్లక్ష్యం చేయడంతోనే కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులను మంచితనంతో మందలించి చక్కగా చదువుకోవాలని సూచించడంతోనే ఉద్దేశపూర్వకంగా విద్యార్థులను కొంతమంది తమ వ్యక్తిగత అవసరాల కోసం రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రిన్సిపాల్ గా కొనసాగుతూనే ప్రవేట్ పాఠశాలలో బోధన…
నారాయణపేట మైనార్టీ ప్రిన్సిపాల్ గా కొనసాగిన ఖాజా మెహబూబ్ ఖాన్ జిల్లా కేంద్రంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో పనిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈయన రెండుచోట్ల కొనసాగినా కూడా జిల్లా స్థాయి పర్యవేక్షణ అధికారి (డీఎండబ్ల్యూ ఓ) మాత్రం మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఇదిలా ఉండగా నారాయణపేట జిల్లా కలెక్టర్‌ను కూడా డీఎండబ్ల్యూ ఓ తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

