కలం, వెబ్ డెస్క్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో (Station Ghanpur) డీజిల్ లీకేజీ కారణంగా ఓ కారు అగ్నిప్రమాదానికి (Car Fire ) గురైంది. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధం కాగా, డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘన్‌పూర్‌లో ముగ్గురితో ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా డీజిల్ లీకేజీ ఏర్పడింది. దీంతో ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. దీనిని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కారును రోడ్డుపక్కన నిలిపివేశాడు.
అనంతరం కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు హుటాహుటిన కిందకు దిగిపోయారు. వారు బయటకు వచ్చిన కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో స్థానికంగా కొద్దిసేపు ఆందోళన నెలకొంది.

