కలం, నిర్మల్: రైతులు ఆయిల్ పామ్ (Oil Palm) పంటల సాగు వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అన్నారు. బుధవారం మామడ మండలం పరిమండల్ గ్రామంలో రైతులు గబ్బర్ సింగ్ చౌహాన్, బిక్కు నాయక్ చౌహాన్ లకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అధికారులు, రైతులతో కలిసి ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంటల ద్వారా రైతులు అధిక లాభాలు పొందగలుగుతారని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్ పామ్ పంటలకు మంచి డిమాండ్ ఉందని, రైతులు పండించిన పంటలకు అధికారులు మార్కెటింగ్ అవకాశం కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
మరింత మంది రైతులు ఆయిల్ పామ్ పంటలను సాగు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఇతర పంటలతో పోల్చుకుంటే ఆయిల్ పామ్ పంటల సాగుకు నీరు కూడా తక్కువ అవసరం అవుతుందన్నారు. అంతర పంటగా ఇతర పంటలు సాగు చేసుకోవచ్చునని చెప్పారు. ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్న రైతులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రమణ, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, రైతులు, పాల్గొన్నారు.

