కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) రూరల్ మండలం కొండాపూర్ (Kondapur) గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు (Elderly Woman) మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రూరల్ ఎస్‌ఐ లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మణ చందా మండలం చామన్‌పల్లి గ్రామానికి చెందిన చిట్యాల రాజవ్వ (వృద్ధురాలు) రెండు రోజుల క్రితం ఎల్లపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం ఉదయం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా కొండాపూర్ వద్ద జాతీయ రహదారిని దాటుతున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారు వేగంగా వచ్చి రాజవ్వను ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

