సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ బిగ్ షాక్.. కీలక నోటీసులు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభ వేదికగా విపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ భూములకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్) నోటీస్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శాసనాసభాపక్షం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అధికారికంగా నోటీస్ అందజేసింది.

మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, గంగుల కమలాకర్ తదితర బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం శాసనసభలో స్పీకర్‌ను స్వయంగా కలిసి ఈ ప్రివిలేజ్ నోటీసు (BRS Privilege Notice) ను సమర్పించింది. సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు వాస్తవ దూరంగా ఉన్నాయని, శాసనసభ వేదికగా ప్రతిపక్ష నేతపై నిరాధారమైన ఆరోపణలు చేసి సభా ప్రాంగణ గౌరవాన్ని భంగపరిచారని నేతలు పేర్కొన్నారు.

అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోని భూముల కేటాయింపులు, పరిమితికి మించిన భూమి ఉందంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలను బీఆర్ఎస్ ఖండించింది. ఎన్నికల అఫిడవిట్లలో చట్టబద్ధంగా సమర్పించిన సమాచారాన్ని పక్కనబెట్టి, తప్పుడు లెక్కలతో శాసనసభను, రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి పక్కదోవ పట్టించారని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అసత్యాలు ప్రచారం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిపై తక్షణమే సభా హక్కుల కమిటీ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌ను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>