కలం, వెబ్ డెస్క్ : బిఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్, కీలక నాయకుడు మన్నె క్రిషాంక్ (Manne Krishank)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏ విధమైన ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తన ఇంటికి వచ్చి అదుపులోకి తీసుకున్నారని క్రిషాంక్ మద్దతుదారులు, కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
అరెస్ట్ సందర్భంగా క్రిషాంక్ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనను తీసుకెళ్తున్న సమయంలో ఇంట్లోని చిన్న పాపతో పాటు కుటుంబ సభ్యులందరూ భయాందోళన చెంది ఏడ్చారని ఆయన ఆవేదన చెందారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను, కుటుంబ సభ్యులను ఈ విధంగా భయబ్రాంతులకు గురిచేసి ఏడిపించడం విచారకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని, అక్రమ కేసులు బనాయించి తమ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.

