స్వరూప్ నగర్ మైనర్ బాలిక హత్య కేసు .. వెలుగులోకి కీలక వివరాలు

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని స్వరూప్ నగర్ (Swaroop Nagar)ప్రాంతంలో మైనర్ బాలిక హత్య కేసు (Minor Girl Murder Case) దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఔటర్ నార్త్ ఢిల్లీ అదనపు డీసీపీ లోకేశ్వరన్ వెల్లడించారు. పొలంలో గుర్తుతెలియని స్థితిలో మృతదేహం లభించడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం

పొలంలో కుళ్లిపోయిన మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో తొలుత అది పురుషుడిదా, మహిళదా అనే విషయాన్ని కూడా నిర్ధారించడం సాధ్యం కాలేదని పోలీసులు తెలిపారు. జిల్లాలో లేదా సమీప ప్రాంతాల్లో ఎవరైనా అదృశ్యమైనట్లు ఫిర్యాదులు కూడా తమకు అందలేదని పేర్కొన్నారు.

దూరంగా ఉన్న సీసీటీవీతో క్లూ

ఘటనా స్థలంలో నేరుగా సీసీటీవీ కెమెరాలు (CCTV Footage) లేకపోవడంతో పోలీసులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో పొలాన్ని కొంత మేరకు కవర్ చేస్తున్న దూరంలోని ఓ సీసీటీవీ కెమెరాను గుర్తించారు. 10-11 తేదీల రాత్రికి సంబంధించిన ఫుటేజీని పరిశీలించగా, వెనుక నంబర్ ప్లేట్ లేని టెంపో అక్కడికి వచ్చినట్లు గుర్తించారు. వాహనం ఎడమవైపున ఉన్న ప్రత్యేక గుర్తు దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.

టెంపో డ్రైవర్ వాంగ్మూలంతో పురోగతి

ఆ గుర్తు ఆధారంగా పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టి అదే తరహా టెంపోను గుర్తించారు. విచారణలో 10-11 తేదీల రాత్రి నలుగురు యువకులు తనను అక్కడికి తీసుకెళ్లమని కోరినట్లు డ్రైవర్ వెల్లడించినట్లు డీసీపీ తెలిపారు. వారిలో ముగ్గురు మైనర్లు కాగా, మరో వ్యక్తిని స్వరూప్ నగర్‌కు చెందిన 21 ఏళ్ల సుదామగా గుర్తించినట్లు చెప్పారు.

ఒకరి అరెస్ట్.. ముగ్గురు మైనర్లు అదుపులో

పోలీసుల ప్రకారం, నిందితులు మైనర్ బాలికను పొలంలోకి తీసుకెళ్లి, మద్యం సేవించిన అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, అనంతరం హత్య చేసి మృతదేహాన్ని అక్కడే వదిలివేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో వయోజన నిందితుడు సుదామను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడించనున్నారు.

కాగా, ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడిని కలిసేందుకు కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఆస్నేహితుడితో పాటు అతనికి తెలిసిన మరో ముగ్గురు మైనర్లు కలిసి ఒక టెంపోలో ప్రయాణించారు. ఆ వాహనంలోనే వారంతా మద్యం తాగి, ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత విషయం బయటపడుతుందనే భయంతో నిందితులు ఆ బాలికను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని ఉత్తర ఢిల్లీలోని స్వరూప్‌ నగర్ ప్రాంతంలోని ఓ పొలాల్లో పడేశారు. సెప్టెంబర్ 13న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>