ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై రేవంత్ సర్జికల్ స్ట్రైక్.. కేసీఆర్‌ వైఖరిపై ఉత్కంఠ!

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో భూముల వ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రూ.లక్ష కోట్ల భూకుంభకోణం చేసిందని.. కేసీఆర్, కేటీఆర్, కవిత సహా కల్వకుంట్ల కుటుంబం భారీ భూదోపిడికీ పాల్పడిందని.. ఇతర బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, ఇనాం, భూదాన్ భూములను కొల్లగొట్టారని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం రాజకీయ దుమారం రేపుతున్నది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనూ (KCR Farmhouse) ప్రభుత్వ భూములు ఉన్నాయని, దానిపై విచారణ చేయాలని సీఎం ఆదేశించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌ భూములపై నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం అధికారులు వెంటనే సర్వే ప్రారంభించారు. ప్రస్తుతం అధికారులు పాత రికార్డులను అధ్యయనం చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఫామ్‌హౌస్‌ భూముల లెక్కపై ఏం తేలుతుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేసీఆర్ స్పందిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎలాంటి వైఖరి అవలంభిస్తారన్నది కీలకంగా మారింది.

ఆ ముగ్గురు కౌంటర్

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ భూములపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఇప్పటికే కేటీఆర్, కవిత, హరీశ్ స్పందించారు. ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పిన దానికంటే ఒక్క గుంట ఎక్కువున్నా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని కవిత ప్రకటించారు. తమ కుటుంబ ఆస్తులపై విచారణకు సిద్ధమని, సీఎం రేవంత్ కూడా అందుకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు. తన ఆస్తులపై విచారణకు సిద్ధమేనని, సీఎం రేవంత్ ఆస్తుల లెక్క కూడా తేల్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. వీళ్లు ముగ్గురు స్పందించినప్పటికీ, కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆయన స్పందిస్తారా? లేక మౌనంగానే ఉంటారా? అన్నది కీలకంగా మారింది.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

సీఎం రేవంత్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే విషయంలో కేసీఆర్‌ ఎలాంటి వైఖరి అవలంభిస్తారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది. సీఎం ఆరోపణలపై స్పందిస్తే, జవాబు చెప్పాల్సిన పరిస్థితి. ఒకవేళ మౌనంగానే ఉంటే, సీఎం ఆరోపణలపై వివరణ ఇవ్వలేకపోయారనే విమర్శలు తప్పవు. ఫామ్‌హౌస్‌ భూములపై సీఎం చేసిన ఆరోపణలకు కేసీఆర్‌ స్వయంగా వివరణ ఇస్తే.. భూరికార్డులు, కొనుగోళ్లు, హక్కులపై చర్చ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ స్పందించకపోతే ఆరోపణలు నిజమేనని కేసీఆర్ అంగీకరించినట్టేనని కాంగ్రెస్ ప్రచారం చేసే అవకాశం ఉన్నది.

‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’ అన్నట్టుగా పరిస్థితి తయారైందని, ఇప్పుడు కేసీఆర్‌ వ్యూహం ఎలా ఉంటుందన్నది కీలకమని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. గతంలో అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలపై ఈటల రాజేందర్‌‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఈ చిక్కుముళ్ల నేపథ్యంలో కేసీఆర్ నేరుగా స్పందిస్తారా? లేక నేతల ద్వారా సమాధానం చెప్పిస్తారా? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>