కలం, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల బోధన, అభ్యసన విధానాలను స్వయంగా పరిశీలిస్తూ విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ (Left Pochampad) గ్రామంలోని ప్రభుత్వ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అధికారులతో కలిసి పాఠశాల పరిసరాలను పరిశీలించిన కలెక్టర్.. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ విద్యార్థులందరికీ మెనూ ప్రకారం అన్ని వేళల్లో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ మమేకమయ్యారు. వారి అభ్యసన సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు అడిగి, స్వయంగా పాఠాలు బోధించారు. విద్యార్థులతో గణిత లెక్కలు చేయించిన ఆయన.. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రోత్సహించాలని సూచిస్తూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పెన్నులను బహుమతులుగా అందజేశారు. పదో తరగతి బోర్డు పరీక్షలకు విద్యార్థులంతా ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో సన్నద్ధం కావాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు.

