కలం, నిర్మల్: ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ జిల్లా సీఐటీయూ (Nirmal CITU) ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు చేపట్టబోతున్న నిరవధిక బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని కోరారు.
ఆటో, క్యాబ్, ఇతర మోటార్ వెహికల్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఓలా, ఊబర్, రాపిడో వంటి యాప్‌ల్లో అధిక కమీషన్లను నియంత్రించి ప్రభుత్వ ఆధ్వర్యంలో యాప్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనతా గ్యారేజ్ యూనియన్ అధ్యక్షుడు సయ్యద్ ఇసాక్, కార్యదర్శి సైపుల్ ఖాన్, కోశాధికారి వాజత్, ఉపాధ్యక్షులు విఠల్, సాగర్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.

