కలం, వెబ్‌డెస్క్: ఆఫ్రికా దేశం నైజీరియా (Nigeria) మళ్లీ నెత్తురోడింది. నైగర్ రాష్ట్రంలోని బొర్గా ప్రాంతంలో ఉన్న కసువాన్–దాజీ గ్రామంలో చొరబడిన దుండగులు.. గ్రామస్థులపై కాల్పులు జరపడంతో 30 మంది చనిపోయారు. చాలా మంది గ్రామస్థులు జాడ లేకుండా పోయారు. వీళ్లలో పిల్లలు, మహిళలు ఉన్నారు. శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఆయుధాలు ధరించి గ్రామంలోకి చొరబడిన ముఠా బీభత్సం సృష్టించింది. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. అనంతరం ఇళ్లను, స్థానిక మార్కెట్‌ను తగలబెట్టింది. దీనిపై ఆలస్యంగా సమాచారం అందడంతో పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. కాగా, కాల్పుల్లో 40 కంటే ఎక్కువ మంది చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆఫ్రికాలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నైజీరియా (Nigeria) లో తరచూ ఇలా నేర, మాఫియా ముఠాలు గ్రామాలపై దాడులకు తెగబడుతుంటాయి. గత నవంబర్‌లో ఇలాగే ఒక గ్రామంపై దాడి చేసి ఏకంగా 300 మంది విద్యార్థులను అపహరించిన ఘటన ప్రపంవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆస్తులు దోచుకోవడం, పిల్లలు, మహిళలను కిడ్నాప్ చేసి అమ్ముకోవడం కోసం ఆయుధాలు ధరించిన ముఠాలు తరచూ ఇలా దాడులకు, నరమేధానికి దిగుతుంటాయి. నైజీరియాలోని ఉత్తర ప్రాంతంలో దట్టమైన అడవులను స్థావరంగా చేసుకొని ఈ ముఠాలు అరాచకాలు చేస్తున్నాయి.


