కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన కింద నడుస్తున్న బస్సుల్లో భద్రతా లోపాలున్నాయన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (CS) కండిషనల్ సమన్లు (NHRC Summons) జారీ చేసింది. పంజాబ్లోని తార్న్ తరణ్ వద్ద తీర్థయాత్ర బస్సుల మధ్య జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యాత్రికులు మరణించగా, సుమారు 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 7, 2026న వ్యక్తిగతంగా హాజరై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఒకవేళ నవంబర్ 30 లోపు సమగ్ర నివేదిక అందిస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంపై ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కానూంగో స్పందించారు. ఇది భగవంత్ మాన్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమని ఆయన మండిపడ్డారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ (CIRT) నివేదికల ఆధారంగా స్లీపర్ కోచ్ బస్సుల బాడీ డిజైన్లు, మార్పులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, దీనివల్ల బస్సుల సమతుల్యత దెబ్బతిని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని 2025లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించామని తెలిపారు.
అయితే తమ రాష్ట్రంలో అసలు స్లీపర్ కోచ్ బస్సులే నడవడం లేదని పంజాబ్ ప్రభుత్వం బాధ్యతారహితమైన నివేదిక ఇచ్చిందని విమర్శించారు. తీర్థయాత్ర పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సులను ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో అక్టోబర్లో మరోసారి హెచ్చరించామని, అయినా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వంలోని ముఖ్యులు, ముఖ్యంగా అరవింద్ తమ పనిని అడ్డుకుంటున్నారంటూ వ్యంగ్యంగా మాట్లాడారని కానూంగో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీనియర్ సిటిజన్లు, యాత్రికుల ప్రాణాలను పణంగా పెట్టి సంక్షేమ పథకాలను అమలు చేయడం తగదని కమిషన్ వ్యాఖ్యానించింది. గతంలో ఆదేశాలు జారీ చేసినా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వకపోవడం, పైగా తాజాగా ఘోర ప్రమాదం జరగడంతో అత్యున్నత స్థాయిలో జవాబుదారీతనం అవసరమని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.
Also Read : బిర్సా ముండా జయంతి వేడుకలు.. గిరిజనుల అభివృద్ధికి మోదీ భారీ కానుక!
Follow Us On : WhatsApp

