కలం, వెబ్‌డెస్క్: పెళ్లిలో ఘోరం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడం (Gas cylinder blast) తో కొత్త జంటతోపాటు మరో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు ధాటికి పెళ్లి ఇల్లు కూలడంతో శిథిలాల్లో అనేక మంది చిక్కుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 19 మందిని బయటికి తీశారు. ఇందులో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన పాకిస్థాన్‌లో ఆదివారం ఉదయం జరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని ఇస్లామాబాద్‌లోని సెక్టార్ జి–7/2 ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతోంది. బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతలో హఠాత్తుగా వంటింట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఆ ఇల్లు కుప్పకూలింది. శిథిలాలు మీద పడి వధూవరులతోపాటు మరో ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
పేలుడు ఎంత భారీ స్థాయిలో జరిగిందంటే ఆ తీవ్రతకు సమీపంలోని మరో నాలుగు ఇళ్లు సైతం బీటలు వారాయి. గాయపడినవాళ్లకు పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(PIMS) ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, చలికాలంలో ఇస్లామాబాద్‌లో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా నమోదవుతాయి. దీంతో ఇంటి వంట అవసరాల కోసమే కాకుండా వేడి కోసం ఉపయోగించే యంత్రాల కోసమూ ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఎక్కువగా వాడుతుంటారు. అందువల్ల ఇక్కడ తరచూ గ్యాస్ సిలిండర్ల పేలుళ్లు (Gas cylinder blast) జరుగుతుంటాయి. దీనికి కారణం నాసిరకం సిలిండర్లు. వీటిలో అధిక పీడనంతో గ్యాస్ లీక్ కావడం వల్ల పేలుతున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు.
బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తూ మరో పెళ్లి కూతురు..
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూంక్వా రాష్ట్రంలోని జమ్రుద్లో జరిగిన ఓ ప్రమాదంలో పెళ్లికూతురితోపాటు ఆమె స్నేహితులు నలుగురు దుర్మరణం పాలయ్యారు. స్థానిక బ్యూటీపార్లర్‌కు పెళ్లి కూతురిని తీసుకెళ్లిన స్నేహితులు తిరిగి వస్తుండగా, వీళ్ల కారును ఓ ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీంతో వాళ్లు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.


