కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad Accident) నగరంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రాయణగుట్ట వద్ద జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ఫాతిమా బేగం అనే 25 ఏళ్ల నవవధువు ప్రాణాలు కోల్పోయారు. నూరీనగర్ ప్రాంతానికి చెందిన ఆమె తన భర్తతో కలిసి ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చంద్రాయణగుట్ట బండ్లగూడ రహదారిపై వారు ప్రయాణిస్తున్న స్కూటర్ యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో అతివేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఫాతిమా బేగం అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త, వారితో పాటు ఉన్న బంధువుల ఇద్దరు పిల్లలు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని ఆపకుండా డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి ఆ ప్రాంతంలోని సిసిటివి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

