కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి జనన, మరణాల నమోదు (Birth Registration) ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. నమోదు ప్రక్రియను అత్యంత కచ్చితంగా, పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం.. జననం లేదా మరణం సంభవించిన రోజు నుంచి ఒక సంవత్సరం దాటి రెండు సంవత్సరాల లోపు నమోదు చేయాల్సి వస్తే సంబంధిత ఆర్డీఓ లేదా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్డర్ తప్పనిసరి. ఒకవేళ రెండు సంవత్సరాలకు పైగా ఆలస్యమైతే మాత్రం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశం పొందిన తర్వాతే నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.
ఆలస్యంగా దాఖలయ్యే దరఖాస్తులలో సమర్పించిన వివరాల కచ్చితత్వాన్ని అధికారులు క్షుణ్ణంగా ధృవీకరించిన అనంతరమే నమోదు ప్రక్రియకు అనుమతిస్తారు. అలాగే నిర్ణీత రుసుము చెల్లించడం, తగిన ధృవీకరణ పత్రాలను సమర్పించడం విధిగా పాటించాలి. ఈ క్రమబద్ధీకరణ ద్వారా నకిలీ నమోదులకు అడ్డుకట్ట పడటమే కాకుండా ప్రజలు సకాలంలో నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం సాధ్యమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

