కలం, కరీంనగర్: జాతీయ రహదారి 563 పై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం (Shankarapatnam Road Accident )మండలం తాడికల్ శివారులో ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ట్రాన్స్‌కో (విద్యుత్ శాఖ) ఉద్యోగుల కారు తాడికల్ శివారులోని జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని తీవ్ర వేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారులోని మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, కారు నడుపుతున్న వ్యక్తి మృతదేహం కారులోనే ఇరుక్కుపోయింది.
ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపిల్లి సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న జూనియర్ లైన్‌మెన్ విశ్వేశ్వరరావు, వాచ్‌మెన్ సుధాకర్, లైన్‌మెన్ ప్రభు (శేఖర్) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. జేఎల్‌ఎంలు ప్రవీణ్, మురళీలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు వరంగల్‌లోని సహచర ఉద్యోగి ఇంట్లో వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న హుజూరాబాద్ ఏసీపీ మాధవి, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై శేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

