Mobile Popup Ad
Mobile Popup Ad

ఏప్రిల్ 1 నుండి మారనున్న ఏటీఎం రూల్స్

కలం, వెబ్ డెస్క్: ఏటీఎం నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు (New ATM rules) అమలు కానున్నాయ. దీంతో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ అలవాట్లను మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, బంధన్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులు, లావాదేవీల రుసుములలో కీలక మార్పులు చేశాయి. డిజిటల్ సేవలను ప్రోత్సహిస్తూనే, ఉచిత లావాదేవీల పరిమితిని ఈ బ్యాంకులు సవరించాయి.

మొదటగా హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ విషయానికి వస్తే, ఇకపై ఏటీఎంల వద్ద చేసే యూపీఐ (UPI) ఆధారిత నగదు విత్‌డ్రాను కూడా నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిలోనే లెక్కిస్తారు. గతంలో వీటిని విడిగా పరిగణించేవారు, కానీ ఏప్రిల్ 1 నుండి ఇవి కూడా ఉచిత కోటా కిందకే వస్తాయి. ఉచిత పరిమితి దాటిన తర్వాత, ప్రతి లావాదేవీకి పన్నులు కాకుండా 23 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ తన ఏటీఎంలలో ఐదు, ఇతర మెట్రో నగరాల ఏటీఎంలలో మూడు ఉచిత లావాదేవీలను అనుమతిస్తోంది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన డెబిట్ కార్డులపై రోజువారీ మనీ విత్‌డ్రా పరిమితిని సవరించింది. కార్డు రకాన్ని బట్టి వినియోగదారులు రోజుకు 50 వేల నుండి 75 వేల రూపాయల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. గతంలో కొన్ని కార్డులపై ఉన్న లక్ష రూపాయల పరిమితిని బ్యాంక్ ఇప్పుడు తగ్గించింది.

బంధన్ బ్యాంక్ కూడా తన నిబంధనలను కఠినతరం చేసింది. ఇతర బ్యాంక్ ఏటీఎంలను వాడేటప్పుడు మెట్రో నగరాల్లో మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలకే అవకాశం ఉంటుంది. పరిమితి దాటితే ఆర్థిక లావాదేవీకి 23 రూపాయలు, ఆర్థికేతర లావాదేవీకి 10 రూపాయలు వసూలు చేస్తారు. ఒకవేళ ఖాతాలో డబ్బులు లేక ఏటీఎం లావాదేవీ విఫలమైతే 25 రూపాయల పెనాల్టీ పడుతుందని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇక డిజిటల్ విప్లవంలో భాగంగా జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన బ్యాంకింగ్ పాయింట్ల వద్ద క్యూఆర్ (QR) కోడ్ స్కాన్ చేయడం ద్వారా కార్డు లేకుండానే నగదు పొందే వెసులుబాటును కల్పించింది. బ్యాంకులు డిజిటల్ విధానం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కొత్త నిబంధనల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>