కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా కోడిమ్యాల (Kodimial) గ్రామంలో నేత్ర స్కిన్ హాస్పిటల్, జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత చర్మ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామ సర్పంచ్, పాలకవర్గం, కోడిమ్యాల గ్రామీణ వైద్యుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 220 మందికి చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ హర్షిణి పెనాల (ఎండీ, డీడీవీఎల్, కాస్మెటిక్ సర్జన్) పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ హర్షిణి మాట్లాడుతూ.. చలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా చర్మం పొడిబారడం, దురద, అలర్జీలు తదితర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. చర్మ వ్యాధులు రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత, చర్మ సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. చర్మ సమస్యలు ఎదురైనప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచించారు.
గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు నేత్ర స్కిన్ హాస్పిటల్ వైద్యులు, యాజమాన్య ప్రతినిధులు రమేష్, సంపత్ కుమార్, సుభాన్, వంశీ తెలిపారు. శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామీణ వైద్యులు, గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలకు చర్మ వైద్య సేవలు అందడంతో కోడిమ్యాల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నేత్ర స్కిన్ హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించి పేద, మధ్యతరగతి ప్రజలకు చర్మ సంబంధిత వైద్య సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీవన్ రెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్, ప్రవీణ్, సురేందర్, శ్రీనివాస్, మధు, నరేష్, గ్రామ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

