కలం, ఆదిలాబాద్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Adilabad Collector) అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాఠశాలల వారీగా హాజరు శాతం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించే సమీక్షలో భాగంగా వెలువడిన నివేదిక ప్రకారం జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ హాజరు శాతం రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల హాజరు సగటు 89 శాతం ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 74 శాతం మాత్రమే నమోదవుతోందని, ఉపాధ్యాయుల హాజరు రాష్ట్ర సగటు 90 శాతానికి పైగా ఉండగా జిల్లాలో 80 శాతానికే పరిమితమైందని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పండుగ సెలవుల అనంతరం కేజీబీవీ వసతి గృహాలకు తిరిగి రాని విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలలకు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో కమ్యూనిటీ మొబిలైజేషన్ చేపట్టాలని, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓల సహకారంతో విద్యార్థుల హాజరును మెరుగుపరచాలని సూచించారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేపట్టిన ‘ఫిజిక్స్ వాలా’ కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజూ విద్యార్థులతో సంబంధిత సబ్జెక్టుల్లో ప్రాక్టీస్ చేయించి అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచాలన్నారు. ఈ ఆదేశాల అమలులో వచ్చే గురువారం నాటికి ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులతో ప్రత్యక్ష సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల హాజరు మెరుగుదల విషయంలో అధికారులు, ప్రధానోపాధ్యాయులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.

