కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ (Armoor)లో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా సీన్ రిపీట్ అయ్యింది. అది సినిమా అయితే ఇక్కడ నిజ జీవితంలోనే అలాంటి ఘటన వెలుగు చూసింది. సినిమాలో పెళ్లి కోసం సిద్ధం చేసిన సొత్తు చోరీ అవుతుంది.. ఇక్కడ బాబాయి వాళ్ళు వేములవాడ దైవ దర్శనానికి వెళ్తే ఇల్లును గుల్ల చేయించాడు అబ్బాయి.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నగరంలోని మహాలక్ష్మి కాలనీలో గల ఓ మార్వాడీ వ్యాపారి మే 24 నాడు తన కుటుంబ సభ్యులతో సహా వేములవాడ దేవస్థానానికి దైవ దర్శనానికి వెళ్లారు. ఆ రోజు ఆ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. వేములవాడ నుంచి వచ్చిన వ్యాపారి కుటుంబం ఒక్కసారిగా షాక్ కు గురయింది. ఒకటి కాదు రెండు కాదు 41 లక్షల 31,500 రూపాయల విలువైన బంగారం, వెండి నగదు దొంగిలించారు. వెంటనే పోలీసు అధికారులు ఒక టీంను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. జూన్ 1 నాడు ఆర్మూర్ నగరంలోని బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారని వచ్చిన సమాచారం మేరకు వెంటనే బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్దకు వెళ్లి తనిఖీ చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు ఒక బ్యాగును కలిగి ఉండటం, వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో విచారణ చేయగా డబ్బు బంగారం కనిపించింది. నిందితులను విచారించగా అసలు విషయం మొత్తం బయట పడింది.
బాబాయ్ ఇంట్లో చొరికి అబ్బాయ్ సూపారీ..
ఆర్మూర్ నగరానికి చెందిన A1– విజయ్ అగర్వాల్ అనే వ్యక్తి తన బాబాయ్ ఇంట్లో దొంగతనం చేయడానికి ఒక పథకం రచించి ముగ్గురు వ్యక్తులను కొంత డబ్బులకు సుపారీ ఇచ్చాడు. A2 – సల్మాన్ ఖాన్ @ ఖళీలుల్ల (25 ) బంజారాహిల్స్, హైదరాబాద్, A3 – మంజల్ సాయి కుమార్ ( 28 ) బంజారాహిల్స్, హైదరాబాద్, A4 – శ్రీహరి [పరారీలో ఉన్న నిందితుడు] లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాబాయ్ ఫ్యామిలీ వేములవాడకు వెళ్తున్న విషయం తెలుసుకొని దొంగతనానికి ప్లాన్ సెట్ చేశాడు. A2 సల్మాన్ ద్వారా బంగారం వెండి నగదును దొంగతనం చేయించాడు. దొంగిలించిన సొత్తును తీసుకోవడానికి ఆర్మూర్ లోని బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్డు వద్దకు రాగా వారిని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన నగదులో నుండి A2 సల్మాన్ తన అవసరాలకు 1,00,000/- రూపాయలను వాడుకోగా , A3 – మంజల్ సాయి కుమార్ 83,500/- రూపాయలను తన అవసరాలకు వాడుకోగా, పరారీలో ఉన్న A4 – శ్రీహరి వద్ద 8,00,000/- ఉన్నాయి.
భారీగా బంగారం సొత్తు స్వాదీనం..
ఆర్మూర్ కు చెందిన అబ్బాయ్ విజయ్ అగర్వాల్ తో పాటు దొంగల ముఠా వద్ద ఉన్న తొమ్మిది బంగారం ముద్దలు, 580 గ్రాములు, 10 గ్రాముల బంగారం చైన్, రెండు 300 గ్రాముల వెండి లక్ష్మి బిళ్ళలు, 50 గ్రాముల వెండి ప్లేట్ తో పాటు 19,33,000/- రూపాయల నగదు 2 సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. సొత్తు విలువ 31 లక్షల 48,000/- రూపాయలు ఉంటుందని పోలీసు కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. అయితే A1- విజయ్ అగర్వాల్ గతంలో కింద ఏడు కేసులలో నిందితుడిగా ఉండటం మరో చెప్పుకోదగ్గ విషయం. ఈసారి ఇక అతనిపై ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు పోలీసు కమిషనర్ తెలిపారు. కేసును చేదించడంలో ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సీసీఎస్ ఇన్స్ పెక్టర్ సాయి నాథ్, అతని టీం, అమరేంధర్/HC-15, కిరణ్ కుమార్/PC-1351, సతీష్/PC-617, అశోక్/PC-1937, అన్వేష్/PC- 390, లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.

