Mobile Popup Ad
Mobile Popup Ad

మారిన ఆర్‌సీబీ రూట్: ఒకరిద్దరిపై ఆధారపడకుండా వరుస కప్పులు!

కలం, స్పోర్ట్స్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే ఒకప్పుడు కేవలం గ్లామర్, భారీ స్టార్లు, భారీ అంచనాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఆర్‌సీబీ (RCB) అంటే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలిచే ఒక తిరుగులేని పవర్‌హౌస్. ఆదివారం అహ్మదాబాద్‌లో ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడడం ద్వారా ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఒకప్పుడు ‘ఈసాలా కప్ నమ్దే’ అంటూ ట్రోల్స్ ఎదుర్కొన్న ఫ్రాంచైజీ, ఇప్పుడు వరుస విజయాలతో ప్రత్యర్థులకు సమాధానం చెబుతోంది.

గతంలో ఆర్‌సీబీ వ్యూహాలు కేవలం విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ లాంటి ఒకరిద్దరు సూపర్‌స్టార్ల చుట్టూనే తిరిగేవి. జట్టులో ఎంతమంది దిగ్గజాలు ఉన్నా, సమష్టి లోపం వల్ల 2009, 2011, 2016లలో ఫైనల్స్ చేరినా ట్రోఫీని మాత్రం అందుకోలేకపోయింది. అప్పట్లో ఆర్‌సీబీ అంటే కేవలం వ్యక్తిగత రికార్డులకే పరిమితమనే విమర్శలు ఉండేవి.

కానీ గత మూడేళ్లలో ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. గ్లామర్ కంటే జట్టు సమతుల్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఆటగాళ్ల ఎంపికలో స్మార్ట్ రిక్రూట్‌మెంట్‌ను తీసుకొచ్చింది. ఎవరి బాధ్యతలు ఏంటో స్పష్టంగా కేటాయించడంతో పాటు, బెంచ్ బలాన్ని కూడా పెంచింది. ఈ వ్యవస్థాగత మార్పే ఇప్పుడు పురుషుల, మహిళల జట్లను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది.

ఈ కొత్త ఫార్ములాను మొదటగా మహిళల జట్టు నిరూపించింది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఉమెన్స్ టీమ్ 2024లో డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడమే కాకుండా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి కప్ కొట్టి తామేంటో నిరూపించింది. అదే దారిలో విరాట్ కోహ్లీ నుంచి రజత్ పటిదార్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాక, పురుషుల జట్టు కూడా సరికొత్తగా దూసుకొచ్చింది. ఒకరిద్దరిపై ఆధారపడటం మానేసి, ప్రతి మ్యాచ్‌లోనూ కొత్త హీరోలు పుట్టుకొచ్చేలా జట్టును తీర్చిదిద్దారు.

దాని ఫలితమే 2025 ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్‌సీబీ, ఆ గెలుపుతో సంతృప్తి పడి రిలాక్స్ అయిపోకుండా, అదే కసితో 2026లోనూ చాంపియన్‌గా నిలిచింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో మాంచెస్టర్ సిటీ, బార్సిలోనా క్లబ్‌లు తమ మెన్స్, ఉమెన్స్ జట్లను ఒకే బ్రాండ్ ఫిలాసఫీతో ఎలా నడిపిస్తాయో.. ఇప్పుడు ఆర్‌సీబీ కూడా అదే తరహా మేనేజ్‌మెంట్ కల్చర్‌ను క్రికెట్‌లో చూపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>