అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా నేలకొండపల్లి

కలం, ఖమ్మం బ్యూరో :  ఖమ్మం జిల్లాలోని చారిత్రక ప్రదేశం నేలకొండపల్లి (Nelakondapalli) ప్రాచీన బౌద్ధ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. తెలంగాణ చారిత్రక సంపదను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతోంది. దేశవిదేశాల నుంచి బౌద్ధ యాత్రికులను ఆకర్షించేలా, భారతదేశంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాల సరసన నేలకొండపల్లిని నిలపాలని ప్రణాళిక రూపొందిస్తోంది.

గతంలో వెలుగులోకి వచ్చిన మహాస్తూపం, బౌద్ధ విహారాలు, సమావేశ మందిరాల అవశేషాలు ఈ ప్రాంత ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ పురాతన కట్టడాలను శాస్త్రీయ పద్ధతుల్లో పరిరక్షించడంతో పాటు పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం రూ.4.26 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.2.50 కోట్లతో ఆధునిక మౌలిక వసతులు, సుందరమైన మార్గాలు, సమాచార సూచికలను ఏర్పాటు చేయనున్నారు. వైటీపీఎస్, తెలంగాణ జెన్‌కో నిధులతో మరో రూ.1.76 కోట్లను వెచ్చించి పురాతన కట్టడాల అసలు రూపం, చారిత్రక ప్రాధాన్యత దెబ్బతినకుండా పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్టును బౌద్ధ ధర్మ సంప్రదాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు కంబోడియా, థాయ్‌లాండ్‌తో పాటు భారత్‌కు చెందిన ప్రముఖ బౌద్ధ భిక్షువుల సలహాలు తీసుకుంటున్నారు. పురావస్తు శాఖ సంచాలకులు, బౌద్ధ ధర్మ నిపుణులు శివనాగిరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు ఉపేంద్ర రెడ్డి, ఆంజనేయ రెడ్డి, బుద్ధవనం ప్రత్యేక అధికారి లక్ష్మయ్య తదితరులతో కూడిన నిపుణుల కమిటీ ప్రాజెక్టుకు మార్గనిర్దేశం చేస్తోంది. విదేశీ బౌద్ధ భిక్షువులు, అనుభవజ్ఞులైన నిపుణుల సూచనలతో సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి, రాబోయే ఏడాదిన్నరలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.

గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, మధ్యమ మార్గ సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా నేలకొండపల్లిని తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతిపాదిత ప్రణాళిక అమలైతే ఈ ప్రాంతం అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడంతో పాటు తెలంగాణ చారిత్రక వారసత్వానికి మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>