ఎల్‌నినోపై మిషన్ మోడ్.. మంత్రుల కీలక పిలుపు

కలం, కరీంనగర్‌ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్‌లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ (Karimnagar )జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల సూచనలు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు.

ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్ తో సహా పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా జిల్లాలో ప్రాజెక్టుల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, విద్యుత్ సరఫరా, రైతులకు అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటున్న చర్యలను సమావేశంలో వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవచ్చని, అందువల్ల ముందస్తు చర్యలే ప్రజలను రక్షిస్తాయని పేర్కొన్నారు.గ్రామ గ్రామాన రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్‌తో పాటు కందులు, నువ్వులు, వేరుశనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, ఉద్యాన పంటల సాగును నేల స్వభావానికి అనుగుణంగా ప్రోత్సహించాలని సూచించారు.

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఈ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అందరం సమిష్టిగా నిలబడి, మిషన్ మోడ్‌లో పనిచేసి ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమిద్దామని పిలుపునిచ్చారు.

రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దాం: శ్రీధర్ బాబు

ఎల్‌నినో ప్రభావం రాష్ట్రం ముందున్న పెద్ద సవాల్ అని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి రైతులు, ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. విలువైన సూచనలు, సలహాలను ప్రభుత్వానికి అందించి ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.

వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టాలి : మంత్రి పొన్నం

ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలో రైన్‌వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి (మాండేటరీ) చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలోకి పంపించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఉమ్మడి గొంతుకతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

కరోనా స్ఫూర్తితో ఎల్‌నినోను అధిగమిద్దాం : మంత్రి అడ్లూరి

కరోనా మహమ్మారి సమయంలో అందరూ సమిష్టిగా పనిచేసి సంక్షోభాన్ని అధిగమించినట్లే, ఇప్పుడు ఎల్‌నినో కారణంగా ఏర్పడుతున్న విపత్కర పరిస్థితులను కూడా సమన్వయంతో ఎదుర్కోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.ఉమ్మడి జిల్లా ఎల్‌నినో సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులు, ప్రజలను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.

ఎక్కువ నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే మొక్కజొన్న, కందులు, పప్పుధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అలాగే రైతులు పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపేలా అధికారులు చైతన్యం కల్పించాలని అన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా పనిచేయాలని, ప్రజల్లో ధైర్యం నింపాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం రైతులు, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎదురయ్యే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>