కలం, వెబ్ డెస్క్: ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్ రీఎగ్జామ్‌లోనూ (NEET ReExam) విద్యార్థులకు ఇబ్బందులు తప్ప లేదు. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా విభూతిభూషణ్ హైస్కూల్ పరీక్షా కేంద్రంలో సెక్యూరిటీ తనిఖీల సమయంలో విద్యార్థినికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. తనను పీరియడ్స్ (Sanitary Pad) గురించి అడిగారని, అవునని చెప్పడంతో అక్కడి మహిళా సిబ్బంది ప్యాంట్ కిందికి దించి శానిటరీ ప్యాడ్‌ను చూపించాలంటూ బలవంతం చేశారని హృషికా పాల్ అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. పరీక్ష రాయకుండా అడ్డుకుంటారనే భయంతో అవమానానికి గురవుతూనే తాను అందుకు అంగీకరించాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది.
హృషికా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. భద్రత పేరుతో విద్యార్థినుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించింది. ఇలాంటి తనిఖీలకు అధికారికంగా అనుమతి ఉందా? అని నిలదీస్తున్నారు. విద్యార్థినులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ తరహా అవమానకరమైన తనిఖీలు చేశారని ఆరోపించింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు రాసిన వందలాది మంది విద్యార్థినులు తమకు ఎదురైన ఇలాంటి భయానక అనుభవాలను కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.
బెలాఘాటా శాంతి సంఘా గర్ల్స్ స్కూల్ కేంద్రంలో తనకు కూడా సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందన్నారు. తాను అసౌకర్యంగా భావిస్తున్నట్లు చెప్పినా వినకుండా ప్యాంట్ కిందికి దించమన్నారని ఒక విద్యార్థిని వాపోయింది. మరికొందరు విద్యార్థినులు నీట్, సీయూఈటీ (CUET), ఎస్‌ఎస్‌సీ లాంటి పరీక్షల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని చెప్పారు. బట్టల లోపల, అంతర్గత దుస్తుల్లోకి చేతులు పెట్టి మరీ తనిఖీలు చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్లు ప్రస్తుతం పరీక్షా కేంద్రాల్లో భద్రతా ప్రోటోకాల్స్‌పై తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.

