కలం, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఖాళీగా మిగిలిన వేలాది వైద్య పీజీ సీట్ల భర్తీకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ –2025 అర్హత మార్కుల కటాఫ్ (NEET PG 2025 cutoff) ను భారీగా తగ్గించింది. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ ఇంకా 18వేల సీట్లు భర్తీ కాకపోవడంతో కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కటాఫ్ పర్సంటైల్ తగ్గింపు ప్రకటించింది. దీని ప్రకారం రిజర్వుడ్ కేటగిరీ(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) అభ్యర్థులకు కటాఫ్ తగ్గింపు ఏకంగా జీరో అయ్యింది. అంటే ఈ కేటగిరీల అభ్యర్థులకు నెగిటివ్ మార్కులు వచ్చినా వాళ్లు కౌన్సెలింగ్‌కు అర్హులే. అలాగే జనరల్, ఈడబ్ల్యూఎస్‌కు 50 నుంచి 7కు, దివ్యాంగ అభ్యర్థులకు 45 నుంచి 5కు పర్సంటైల్ తగ్గింది. కాగా, కటాఫ్ తగ్గింపుపై అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటికే ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం లేనందున, పీజీ విభాగంలో స్పెషలిస్ట్‌ల కొరతను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
Read Also: తప్పు చేయకుంటే బ్యాంకాక్ ఎందుకు పారిపోతున్నారు? : సీపీ సజ్జనార్
Follow Us On : WhatsApp


