కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఓటరు జాబితాల ఖచ్చితత్వం కోసమే ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని, ఓట్లు తొలగిస్తారనే అపోహలను ఎవరూ నమ్మ వద్దని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక (Narayanpet Collector Priyanka) అన్నారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమైన సర్ (SIR Voter Survey) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. అందులో భాగంగా నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించారు. గ్రామానికి చెందిన బసుదే కిష్టప్ప ఇంటికి వెళ్ళి స్వయంగా కలెక్టరే ఫారాలను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపాలో ఇంటి యజమానికి అర్థం అయ్యేలా వివరించారు. నింపిన ఫారాలను రెండు, మూడు రోజుల్లో తిరిగి బీఎల్వోలకు అందజేయాలని తెలిపారు.
రెండు రోజుల్లో గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలని బీఎల్వోలను ఆమె ఆదేశించారు. ఫారాలు ఇచ్చేటప్పుడే ఓటర్ల అనుమానాలను బీఎల్వోలు నివృత్తి చేయాలన్నారు. ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలలో అన్ని వివరాలు రాసి తిరిగి ఇచ్చేయాలని కలెక్టర్ కోరారు. అనంతరం బసుదే కిష్టప్ప ఇంట్లో మగ్గంపై నేత కార్మికులు నేస్తున్న నారాయణపేట కాటన్ చీరలను ఆమె ఆసక్తిగా చూశారు. చీరలు నేసే మొత్తం ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. కిష్టప్ప ఇంట్లో ఉన్న కాటన్ చీరలను పరిశీలించి మూడు చీరలను కలెక్టర్ కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగీత, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

