‘ఎస్‌ఐఆర్‌’లో పూర్తి పారదర్శకత పాటించాలి: యోగితా రాణా

కలం, ఆదిలాబాద్ : సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌–2026) ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌ యోగితా రాణా (Yogita Rana) అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు, అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షాతో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియపై ఆమె సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రత్యేక సవరణ గతంలో నిర్వహించిన సవరణలకు భిన్నంగా అత్యంత సమగ్రంగా కొనసాగుతోందన్నారు. 2002, 1984 నాటి రికార్డులు, సంబంధిత పత్రాలను ఆధారంగా చేసుకుని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు, పత్రాల సరిపోలికలో సమస్యలు ఉన్నట్లయితే వాటిని వెంటనే గుర్తించి, అవసరమైన ధ్రువపత్రాలను 24 గంటల్లోగా అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రం పరిధిలో ఓటర్ల సంఖ్యను పరిశీలించాలని, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బూత్‌ లెవల్‌ ఏజెంట్ల (బీఎల్‌ఏ) పాత్ర కీలకమని, అధికారులు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేసి ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>