యాప్‌ల విషయంలో జాగ్రత్త.. ఎస్పీ వినీత్ హెచ్చరిక

కలం, నారాయణపేట: గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ (Narayanpet SP) డాక్టర్ వినీత్(Vineeth) ప్రజలకు సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత అవగాహన వాల్ పోస్టర్‌ను సోమవారం ఎస్పీ కార్యాలయంలో డాక్టర్ వినీత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. “వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు” అనే సందేశంతో రూపొందించిన పోస్టర్‌లో సైబర్ మోసాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్నంగా వివరించినట్లు తెలిపారు. వినాయకుడి పెద్ద చెవులు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలని, చిన్న కళ్లతో నిశితంగా గమనించాలని, పెద్ద తలతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నట్లుగా పోస్టర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.

అత్యాశ, భయం, తొందరపాటు వంటి భావోద్వేగాలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటారని ఎస్పీ హెచ్చరించారు. ప్రతి గణేష్ మండపం వద్ద సైబర్ భద్రత అవగాహన వాల్ పోస్టర్‌ను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని మండప నిర్వాహకులకు సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం, గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం చేయవద్దన్నారు.

బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఓటీపీ, పిన్ వంటి రహస్య సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ఉద్యోగాలు, పెట్టుబడులు, రుణాలు, బహుమతులు, లాటరీల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి మోసపోవద్దని ఎస్పీ సూచించారు. ఏదైనా అనుమానాస్పద పరిణామం ఎదురైతే వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పేట ఇన్‌చార్జి సైబర్ క్రైమ్ డీఎస్పీ కాజల్ జస్వాల్, ఆర్‌ఐ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>