Mobile Popup Ad
Mobile Popup Ad

సర్కార్ బడిలో అడ్మిషన్లు ఫుల్.. ఇదెంతో ప్రత్యేకం!

కలం మెదక్ బ్యూరో: పేరున్న ప్రైవేట్ స్కూళ్లలో డోనేషన్లు కట్టి మరీ అడ్మిషన్ల కోసం పోటీ పడుతుండటం చూస్తుంటాం. కానీ, ఒక ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరికితే చాలు అని తల్లిదండ్రులు భావించడం చూశామా..! సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ (Narayanakhed) జడ్పీ పాఠశాలను చూస్తే ఎవరైనా అనాల్సిందే..! పాఠశాల ప్రారంభమైన మూడు రోజుల్లోనే విద్యార్థుల తాకిడి తట్టుకోలేక ‘నో అడ్మిష‌న్ బోర్డు’ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

కార్పొరేట్ పాఠశాలలను మించి అడ్మిషన్లు..

నారాయణఖేడ్‌ జడ్పీ పాఠశాల కార్పొరేట్ స్కూళ్లను మించి ఫ‌లితాలు సాధిస్తుండటంతో ఇక్కడ చదివేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో ఇక్కడ 800 మందికి పైగా విద్యార్థులు చ‌దివారు. 165 మంది విద్యార్థులు వెళ్లిపోగా.. పాఠశాలల పునఃప్రారంభమైన మూడు రోజుల్లోనే 120 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 835కి చేరింది. ఏ, బి సెక్షన్లు ఏర్పాటు చేసినా విద్యార్థులు వస్తూనే ఉన్నారు. కేవలం 13 తరగతి గదులు, 22 మంది టీచ‌ర్లే ఉండటం, ఇత‌ర స‌దుపాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో నో అడ్మిషన్ల బోర్డును ఏర్పాటు చేశారు. 2022– 23 సంవత్సరంలో 756 మంది, 2023– 24లో 800 మంది, 2024–25లో 880 మంది విద్యార్థులు చేరారు. గతేడాది ఆగస్టు మొదటి వారంలో నో అడ్మిషన్ల బోర్డు ఏర్పాటు చేయగా, ఈసారి మాత్రం ప్రారంభమైన మూడు రోజులకే ప్రవేశాలు లేవనే బోర్డు ఏర్పాటు చేయడం గమనార్హం.

పీఎం శ్రీ పథకానికి కూడా ఎంపిక..

నారాయణఖేడ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలకు సుమారు 50 గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చదువు చెబుతున్నారు. ఇక్కడ చ‌దివిన పది విద్యార్థుల్లో ఏటా బాసర ట్రిపుల్ ఐటీతో ప్రతిష్ఠాత్మక కాలేజీల్లో చేరి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. కార్పొరేట్‌కు ధీటుగా ఫ‌లితాలు సాధిస్తుండటంతో కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించి పీఎం శ్రీ పథకానికి ఎంపిక చేసింది. అత్యాధునిక‌ కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్ర‌రీతో పాటు ప‌లు ర‌కాల ఒకేషనల్ కోర్సుల‌ను అందిస్తున్నారు. బ్యూటిషన్, సంగీతం, సాహిత్యం వంటి రంగాల్లో నిరంతరం శిక్షణ ఇస్తున్నారు . పీఎం శ్రీ పథకంలో భాగంగా కొత్తగా 5 భవనాలు నిర్మాణం జరుగుతోంది. అత్యుత్తమైన విద్యా బోధనతో పాటు క్రీడలు, యోగా, కరాటే, ఇత‌ర ఆట‌ల‌ శిక్షణ అందిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా రాణిస్తున్న ఇక్కడ చేరేందుకు ఏటా విద్యార్థులు విపరీతంగా పోటీ పడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>