epaper
Monday, February 2, 2026
spot_img
epaper

నరవణే రాతలపై ఢీ అంటే ఢీ

కలం, వెబ్​డెస్క్​: బడ్జెట్​ సమావేశాల్లో సోమవారం అధికార, ప్రతిపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అనే రీతిలో మాటల యుద్ధం నడిచింది. ఆర్మీ మాజీ చీఫ్, జనరల్ ఎంఎం నరవణే రాసినట్లుగా చెప్పే ఓ పుస్తకంలోని వ్యాఖ్యల్ని(Naravane Memoir) కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ప్రస్తావించడం దీనికి కారణం. రాహుల్​ వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇరువైపులా మద్దతుగా సభ్యులు వాద ప్రతివాదాలకు దిగడంతో గందరగోళం చెలరేగింది. అనంతరం కాసేపటికే లోక్​సభను రేపటికి వాయిదా వేశారు.

ఏం జరిగిందంటే..

లోక్​సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే సమయంలో రాహుల్​ గాంధీ (Rahul Gandhi) డోక్లాం, లద్ధాఖ్​ సంఘటనల గురించి ప్రస్తావించారు. ఆ ప్రాంతాల్లో చైనా దళాలు తిష్ఠ వేశాయంటూ.. ఆర్మీ మాజీ చీఫ్​ నరవణే రాసినట్లుగా చెబుతున్న ఓ పుస్తకంలోని మాటలను (Naravane Memoir) చెప్పారు. దీనిపై హోంమంత్రి అమిత్​ షా, డిఫెన్స్​ మినిస్టర్​ రాజ్​నాథ్​ సింగ్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆ పుస్తకం రిలీజ్ అయ్యిందా?’ అని ప్రశ్నించారు. ఇంకా విడుదల కాలేదని పేర్కొన్న రాహుల్​.. నరవణే ఆత్మకథలోని ఆ మాటలు ఓ మ్యాగజైన్​లో వచ్చాయన్నారు. దీంతో ఇంకా రిలీజ్​ కాలేదని చెబుతున్న పుస్తకంలోని మాటల్ని రాహుల్​ ప్రస్తావించడంపై అమిత్​ షా, రాజ్​నాథ్​ తీవ్రంగా ఆక్షేపించారు. స్పీకర్​ ఓం బిర్లా సైతం ఇది సరైన పద్ధతి కాదని రాహుల్​కు సూచించారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర గందరగోళానికి దారితీసింది.

ఈ క్రమంలో కాసేపటికి డోక్లాం ప్రతిష్టంభన గురించి అప్పట్లో ఆర్మీ చీఫ్​ నరవణే మాట్లాడిన మాటల వీడియోను అధికార పార్టీ సభలో ప్రదర్శించింది. దీనికి కౌంటర్​గా రాహుల్​ తన వ్యాఖ్యల్ని సమర్థించే ఆధారాలు తీసుకొచ్చారు. ఇంకా రిలీజ్​ కాని నరవణే ఆత్మకథ ‘ఫోర్​ స్టార్స్​ ఆఫ్​ డెస్టినీ’లోని కొన్ని మాటల్ని ప్రచురించిన ‘ది కారవాన్​’ అనే మ్యాగజైన్​ను సభలోకి తీసుకొచ్చి చూపించారు. దీంతో మళ్లీ గందరగోళం చెలరేగింది. ఎన్​డీఏ, ఇండియా కూటమి సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో స్పీకర్​ సభను కాసేపు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమయినా గందరగోళం సద్దుమణగకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అనంతరం రాహుల్​ గాంధీ పార్లమెంట్​ ఆవరణలో మాట్లాడారు. ఎన్​డీఏ ప్రభుత్వం తనను సభలో మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ‘నేను కేవలం ఆర్మీ మాజీ చీఫ్​ నరవణే ఆత్మకథలోని మాటలను మాత్రమే ప్రస్తావించాను. ఆ రెండు సంఘటనల్లో మనం గెలిచామా? లేదా అని అడగలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఉలికిపడింది. సభలో నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది’ అని రాహుల్​ అన్నారు.

Read Also: ఢిల్లీలో ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తోంది: మమతా బెనర్జీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>