కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ (Mega DSC) ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఇది మెగా డీఎస్సీ కాదని, బ్రోకర్లకు ఫలహారంగా మారిన మెగా లీకేజీ అని విమర్శించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆధ్వర్యంలో పేపర్లు లీక్ అయ్యాయని, డేటా డిలీట్ చేశారని, చివరకు మెరిట్ లిస్టును కూడా మాయం చేశారని ఆరోపించింది. ఇది విద్యా శాఖా లేక స్కామ్ శాఖా అని ప్రశ్నిస్తూ.. స్పోర్ట్స్ కోటా పోస్టులను రూ.15 లక్షలకు బేరసారాలు ఆడుతూ, అభ్యర్థులను ఇంటికే పిలిచి డీల్స్ మాట్లాడుకున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కాస్తా వేలం పాటగా మారిందని, నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం అవినీతి నామాలు పెట్టిందని ఎద్దేవా చేసింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక డార్క్ ఆపరేషన్‌గా అభివర్ణించిన వైసీపీ (YCP).. మెగా డీఎస్సీలో మెరిట్ లిస్టును ఎందుకు దాచారో, టాపర్ వివరాలను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ (Nara Lokesh), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను డిమాండ్ చేసింది. కేవలం సెలెక్ట్ అయిన వారికి మాత్రమే ఎస్ఎంఎస్‌లు పంపడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించింది. ఎస్‌సీఈఆర్టీ కాంట్రాక్ట్ ఉద్యోగి టాపర్‌గా రావడం, ఆ తర్వాత డేటా డిలీట్ కావడం వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని ఆరోపించింది.
Read Also: పవన్ కల్యాణ్ ఫ్లైట్ జర్నీలు.. జనసేన కీలక ప్రకటన
Follow Us On : WhatsApp

