కలం, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ (Hyderabad)లో గంజాయి క్వీన్, లేడీ డాన్‌గా పేరుగాంచిన నీతూబాయి (Neetu Bai) ఆగడాలు శ్రుతి మించుతున్నాయి. గంజాయి కేసులో గతంలో ఆమెపై పోలీసులు పీడి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. అయిన సరే నీతూబాయి తీరు మాత్రం మారడం లేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె యథేచ్ఛగా గంజాయి దందాను కొనసాగిస్తూ పోలీసులకే సవాల్ విసురుతుంది.
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్ ఐటీ కోర్ ఏరియాలో ఈగల్ టీమ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఈగల్ టీం బృందం దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లేడీ డాన్‌గా పేరుగాంచిన నీతూబాయి తన మకాంను ధూల్‌పేట్ నుంచి వచ్చి ఐటీ కోర్ ఏరియాలోకి మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కిరాణా షాపు మాటున నీతూబాయి గంజాయి అమ్మకాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నీతూబాయిని పట్టుకునేందుకు పోలీసులు, ఈగల్ టీం సిబ్బంది ప్రయత్నించినప్పటికి ఆమె అక్కడి నుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఈగల్ టీం సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులను గంజాయి కొనుగోలు చేస్తున్నప్పుడు పట్టుకుంది.
గంజాయి అమ్మకాల్లో మోస్ట్ పాపులర్
హైదరాబాద్‌లో గంజాయి క్వీన్‌గా పేరుంది. ఒకప్పుడు సాధారణ గృహిణిగా ఉన్న ఆమె క్రమ క్రమంగా గంజాయి దందా మొదలుపెట్టింది. ఆమె కుటుంబం కూడా గుడుంబా దందా చేసేది. అయితే ఆబ్కారీ శాఖ రాష్ట్రంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పూర్తిగా నిషేధించడంతో వారు గంజాయి దందా మొదలుపెట్టారు. ధూల్‌పేటను కేంద్రంగా గంజాయి విక్రయించడం మొదలుపెట్టారు. 2023లో నీతూబాయి పోలీసులకు పట్టుబడినప్పుడు గంజాయి అమ్మకాలతో రూ.4 కోట్ల స్థిర, చరాస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించి.. వాటిని జప్తు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ తీసుకువచ్చి తమ దందాను మూడు పూలు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. 2023 పోలీసులకు పట్టుబడినప్పుడు ఆరా తీయగా బ్యాంకు ఖాతాల్లో 1.63 కోట్ల రూపాయలతో పాటు స్థిరాస్తులు 2 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు గుర్తించారు. 4 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం జప్తుచేశారు.
జైలుకు వెళ్లొచ్చిన తీరు మారదు
గంజాయి కేసుల్లో నీతూబాయ్ పలుమార్లు జైలుకెళ్లింది. 2021లో ఆమెపై పీడీ యాక్టు నమోదు చేశారు. దీంతో ఆమె జైలుకు వెళ్లారు. జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నీతూబాయ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మరోసారి నీతూబాయ్ మళ్లీ అదే దందాను మొదలుపెట్టింది. అనంతరం నానక్‌రాంగూడ (Nanakramguda)లోకి మకాం మార్చి ఐటీ కారిడార్‌ను అడ్డాగా చేసుకొని నీతూబాయి గంజాయి దందా సాగిస్తోంది. నిత్యం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయి విక్రయాలను నీతూబాయి కొనసాగిస్తున్నట్లు సమాచారం.

