epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

పేర్ల మార్పు: ఉత్తరాది వర్సస్​ దక్షిణాది!

కలం, వెబ్​డెస్క్​: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు (Name changes controversy) పై ఒకవైపు ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సమయంలోనే మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. కేంద్రంలోని ఎన్​డీఏ ప్రభుత్వం చట్టాలు, పథకాల పేర్లను హిందీలోకి మారుస్తోందని, ఇది హిందీని బలవంతంగా తమపై రుద్దడమేనని దక్షిణాది నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో మరోసారి ఉత్తరాది వర్సస్​ దక్షిణాది చర్చ మొదలైంది. ఇదే విషయమై లోక్​సభ వేదికగా సోమవారం పలువురు దక్షిణాది ఎంపీలు తమ ఆందోళన, అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​.. ఉన్నత విద్యాసంస్థలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ఉద్ధేశ్యించిన ‘వికసిత్​ భారత్​ శిక్షా అధిష్టాన్​’ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దక్షిణాది ఎంపీలు తమ వాదన వినిపించారు.

కేరళకు చెందిన ఆర్​ఎస్​పీ ఎంపీ ఎన్​.కె. ప్రేమచంద్రన్​ మాట్లాడుతూ.. కొత్త పథకం పేరు పలకడానికి సైతం కష్టంగా ఉందన్నారు. ఇలా హిందీలో పేరు పెట్టడం ఆర్టికల్​348(బి) ప్రకారం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తమిళనాడు ఎంపీలు జ్యోతిమణి(కాంగ్రెస్​), టీఎం సెల్వగణపతి(డీఎంకే), టీఆర్​ బాలు(డీఎంకే) సైతం కొత్త పేర్లతో హిందీని బలవంతంగా దక్షిణాదిపై రుద్దుతున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తమిళనాడులో ఇప్పటికే ఈ విషయంపై వ్యతిరేకత ఉంది. నూతన విద్యా పాలసీ–2020 ప్రకారం త్రిభాషా విధానాన్ని మా రాష్ట్రంలో అమలు చేయడం లేదనే సాకుతో మాకు సర్వశిక్షా అభియాన్​ నిధులను కేంద్రం ఆపేసింది’ అని వాళ్లు అన్నారు.

హిందీని బలవంతంగా రుద్దడం హిందీయేతర భాషలను మాట్లాడే ప్రజలను, రాష్ట్రాలను అవమానించడమేనని కాంగ్రెస్​ రాజ్యసభ సభ్యుడు, సీనియర్​ నాయకుడు పి.చిదంబరం అన్నారు. ఇలా పేర్లు మార్చే బదులు చట్టం/బిల్లు పేరును హిందీ ప్రాంతాల్లో హిందీ అక్షరాలతో రాయాలని సూచించారు. అయినా, ఇంగ్లీష్​లో పేర్లు ఉండడం వల్ల 75 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందీ లేదని, ఇప్పుడు హిందీలోకి మార్చాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని నిలదీశారు.

రాజ్యాంగం ఏం చెబుతోంది?

రాజ్యాంగంలోని ఆర్టికల్​ 348(1)(బి) ఏం చెబుతోందంటే.. పేర్ల మార్పుపై పార్లమెంట్​ నిర్ణయం తీసుకుంటే తప్ప కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని అన్ని రకాల బిల్లులు, చట్టాలు, ఉప చట్టాలు, ఆర్డినెన్స్​, ఆర్డర్స్​, రూల్స్​, రెగ్యులేషన్స్​తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రొసీడింగ్స్​ అన్నీ కూడా ఇంగ్లీష్​లోనే ఉండాలి. అలాగే ఈ చట్టాల్లోని అంశాల అనువాదంపై వివాదం తలెత్తినప్పుడు ఇంగ్లీష్​లో ఉన్నదానికే ప్రాధాన్యం ఇవ్వాలి.

హిందీలోకి మార్చిన కొన్ని పేర్లు:

గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును ‘వికసిత్​ భారత్​ జి రామ్​ జి’ గా మార్చనున్నట్లు, విద్యా శాఖలో వికసిత్​ భారత్​ శిక్షా అధిష్టాన్​ బిల్లు, ఇన్సూరెన్స్​ చట్టంలో సవరణ ‘సబ్కా బీమా, సబ్కీ రక్ష’ పేరుతో తేనున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే అణుశక్తి రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం ఆహ్వానిస్తూ ఇంగ్లీష్​లో పెట్టిన పేరు ‘సస్టైనబుల్​ హార్నెసింగ్​ అండ్​ అడ్వాన్స్​మెంట్​ ఆఫ్​ న్యూక్లియర్​ ఎనర్జీ ఫర్​ ట్రాన్స్​ఫార్మింగ్​ ఇండియా’. దీన్ని ఇంగ్లీష్​లో కుదిస్తే ఎస్​హెచ్​ఏఎన్​టీఐ(శాంతి) అని వస్తుంది. వీటికంటే ముందు ఇండియన్​ పీనల్​ కోడ్​, ది కోడ్​ ఆఫ్​ క్రిమినల్​ ప్రొసీజర్​, ఇండియన్​ ఎవిడెన్స్​ యాక్ట్​ పేర్లు మార్చింది. వీటిని వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్​ సురక్షా సంహిత, భారతీయ శిక్షా బిల్లుగా తెచ్చింది. అలాగే ఎయిర్​క్రాఫ్ట్​ యాక్ట్​–1934కు భారతీయ వాయువన్​ విధేయక్​ లా అని పేరు పెట్టింది.

Read Also: ఈ ఏడాది ‘అలెక్సా’ని ఎక్కువగా అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>