కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి బిఆర్ఎస్ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికులను ఉద్దేశించి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మేఘా కృష్ణారెడ్డికి అమ్మేసి, వేలాది మంది కార్మికులను వీధిన పడేసింది. తమ జేబులు నింపుకోవడానికే నాయకులు కార్మికుల జీవితాలను బలిపశువులను చేస్తున్నారు.
గతంలో కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కానీ నేడు పరిస్థితి దారుణంగా మారిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి రాకముందు 32 డిమాండ్లు తీరుస్తామంటూ మాయమాటలు చెప్పి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కార్మికులెవరూ అధైర్యపడి ఆత్మబలిదానాలకు పాల్పడవద్దనీ, వచ్చేది మన ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మరోవైపు ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆపబోమని కార్మికులు స్పష్టం చేశారు. బిఆర్ఎస్ నేతల మద్దతుతో సమ్మె మరింత ఉధృతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

