కొండా దంపతులను బర్తరఫ్‌ చేయాలి: కాంగ్రెస్‌ నేత రమేష్‌

కలం, వరంగల్‌: మంత్రి కొండా సురేఖ (Konda Surekha), కొండా మురళి దంపతుల తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని కాంగ్రెస్‌ నేత నల్గొండ రమేష్‌ (Nalgonda Ramesh) ఆరోపించారు. కొండా దంపతులను పార్టీ నుంచి బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మాజీ కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు మంత్రి కొండా సురేఖ, కొండా మురళి, సుస్మిత పటేల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
బీసీలను అడ్డం పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుతూ అదే సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడు ఎదగకుండా అడ్డుకుంటున్నారని నల్గొండ రమేష్‌ ఆరోపించారు. వరంగల్‌ తూర్పులో రెండో బీసీ నాయకుడు ఎదగకుండా చేస్తున్నారని, పార్టీ కోసం పనిచేసే నాయకులను పక్కనపెట్టి ఒక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. నాయకులకు నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.

సుస్మిత క్షమాపణ చెప్పాలి

సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత పటేల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని నల్గొండ రమేష్‌ అన్నారు. ఆమె సీఎం రేవంత్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పరమేశ్‌ మాట్లాడుతూ.. వరంగల్‌ తూర్పులో బీసీలను తొక్కడమే కొండా దంపతుల పనిగా మారిందని ఆరోపించారు. బీసీ మహిళ అయి ఉండి బీసీలనే అణగదొక్కుతున్నారని విమర్శించారు. పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి రౌడీషీట్లు తెరిపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ కోసం పనిచేసే వారినే ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.

మురళికి ఏ హోదా ఉంది?

మాజీ కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌ మాట్లాడుతూ.. “కొండా మురళికి ఏ హోదా ఉందని పరకాల టికెట్‌, కార్పొరేటర్‌ టికెట్లు ప్రకటిస్తారు? మీరెవరు ప్రకటించడానికి?” అని ప్రశ్నించారు. క్రమశిక్షణ లేని వారు పార్టీలో ఉండకూడదని, మంత్రిని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బర్తరఫ్‌ వేడుకల కోసం తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొండా దంపతుల వ్యవహారం శాడిజాన్ని తలపిస్తోందంటూ నరేందర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారితో ఉన్నవారు ప్రేమతో కాకుండా భయంతో ఉన్నారని ఆరోపించారు. “మీది ఊపు కాదు.. వాపు” అంటూ ఎద్దేవా చేశారు. కొండా దంపతులను బర్తరఫ్‌ చేస్తే వారి ఇంటి ముందు నలుగురు కూడా కనిపించరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>