కలం, నల్లగొండ : దేశ ఐక్యత, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడటం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో (Nalgonda Police) ‘జాతీయ ఐక్యత దినోత్సవ’ (National Unity Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం అనంతరం వందలాది సంస్థానాలను విలీనం చేసి, బలమైన సమైక్య భారతదేశ నిర్మాణానికి సర్దార్ పటేల్ విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలు, అచంచలమైన నిబద్ధత నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రజల భద్రతతో పాటు దేశ అంతర్గత భద్రత పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు.
పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని జాతీయ ఐక్యత సందేశాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేయాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏవో శివప్రసాద్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, పలువురు సీఐలు, ఆర్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

