Mobile Popup Ad
Mobile Popup Ad

అంత‌ర్ జిల్లా విద్యుత్ దొంగ‌ల ముఠా అరెస్ట్‌!

కలం, నల్లగొండ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుసగా ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్, ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతూ విద్యుత్ వ్యవస్థను దెబ్బతీస్తున్న ఒక అంతర్ జిల్లా దొంగల ముఠా (Power Theft Gang)ను నల్గొండ జిల్లా పోలీసులు (Nalgonda Police) అరెస్ట్ చేశారు. ముఠా లీడర్ హమీద్ హుస్సేన్‌తో పాటు ఐదుగురు రోహింగ్యా శరణార్థులను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు. నిందితుల నుండి రూ.7,71,000 నగదు, రెండు లక్షల విలువైన 3 బైకులు, దొంగతనానికి ఉపయోగించే కట్టర్లు, పానాలను స్వాధీనం చేసుకున్నారు. నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణి స్టీల్ లిమిటెడ్ కంపెనీలో గతేడాది డిసెంబర్ 17న భారీ దొంగతనం జరిగింది. కంపెనీ ట్రాన్స్‌ఫార్మర్ల నుండి 21 వేల లీటర్ల ఆయిల్, కాపర్ కాయిల్స్, కాపర్ వైర్లతో పాటు విలువైన కాపర్ ఎలిమెంట్స్ చోరీకి గురయ్యాయి. దీనిపై అడ్మిన్ ఇన్‌చార్జ్ నెళ్లుట్ల చందు కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 10న మధ్యాహ్నం నార్కట్‌పల్లి గ్రామ శివారులోని NH-65 రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మూడు బైక్‌లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులను ఆపి విచారించారు. సరైన పత్రాలు లేకపోవడం, వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము చేసిన వరుస విద్యుత్ దొంగతనాల గుట్టు విప్పారు. నిందితుల్లో హమీద్ హుస్సేన్ (26), జహంగీర్ ఆలం (30), నూర్ కాసిమ్ (35), నూరుల్ అమీన్ (27), నూరుల్ ఆలం, మహబూబ్ ఆలం (33) జల్సాల కోసమే దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నిందితులంతా సుమారు 12 సంవత్సరాల క్రితం బర్మా (మయన్మార్) నుండి శరణార్థులుగా భారతదేశానికి వచ్చారు.

ఢిల్లీలో కొన్ని రోజులు ఉండి, ఆ తర్వాత హైదరాబాద్ చేరి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరంతా కలిసి మద్యం సేవించే క్రమంలో స్నేహితులుగా మారారు. కూలీ డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో, సులువుగా డబ్బు సంపాదించేందుకు ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు తెరలేపారు. రాత్రి వేళల్లో బైక్‌లపై తిరుగుతూ ఊరికి దూరంగా ఉన్న లేదా మూతపడిన కంపెనీలలోని ట్రాన్స్‌ఫార్మర్లను టార్గెట్ చేసేవారు. ఆపై ఆటోలను అద్దెకు మాట్లాడుకుని వచ్చి, కట్టర్లు, పానాల సహాయంతో కాపర్, ఆయిల్‌ను దొంగిలించి నల్లబజారులో అమ్మి సొమ్మును సమానంగా పంచుకునేవారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ జితేందర్ రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐలు సతీష్ వర్మ, విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, కానిస్టేబుళ్లు అస్రార్, శివరాజ్, నరేష్, జునేద్, కమల్ కిషోర్‌లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>