కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేశంలో నీట్ కుంభకోణం చోటుచేసుకుని కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నష్టపోయిన విద్యార్థులకు సంఘీభావంగా సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో సోమవారం రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ఓల్డ్ డిపో వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ, విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదని అన్నారు. తక్షణమే నీట్ విధానాన్ని రద్దు చేసి (NEET Cancellation), వైద్య విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకే తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ విరమణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. అనంతరం పట్టణంలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) నిధుల నుంచి రూ.2 కోట్ల వ్యయంతో భజన మందిర్ రోడ్డులో నిర్మించిన సెంట్రల్ డివైడర్, టూ-వే రోడ్డు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రహదారుల విస్తరణ, ఆధునిక లైటింగ్ ఏర్పాటుతో రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రాబోయే రోజులలో పట్టణంలోని ప్రధాన రహదారులన్నింటినీ మోడల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మంజూరైన అభివృద్ధి పనులను అధికారులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, మున్సిపల్ కమిషనర్ సుజాత, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

