కలం మెదక్ బ్యూరో : సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) బస్ స్టేషన్‌లో వర్షాకాలంలో ఏర్పడుతున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, రద్దీకి అనుగుణంగా బస్టాండ్ ను అభివృద్ధి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి హుస్నాబాద్ బస్ స్టేషన్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్‌లోని ప్రయాణికులతో నేరుగా మాట్లాడిన మంత్రి.. బస్సుల రాకపోకలు, మౌలిక సదుపాయాలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రజలు వర్షాకాలంలో బస్ స్టేషన్ సమస్యలపై తన దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఆర్టీసీ ఎండీ, అధికారులతో కలిసి పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. రోజుకు సుమారు 35 వేల మంది ప్రయాణికులు ఈ బస్ స్టేషన్‌ను వినియోగిస్తున్నారని, రెవెన్యూ పరంగా రాష్ట్రంలో ప్రముఖ బస్ స్టేషన్లలో ఇది ఒకటని చెప్పారు. పెరుగుతున్న పట్టణ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కళాశాలలు, పర్యాటక రంగం, మెడికల్ కళాశాలలు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధితో హుస్నాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతోందన్నారు. నాలుగు జిల్లా కేంద్రాలకు ఫోర్‌లేన్ రహదారులతో అనుసంధానం కలిగిన హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

